Ishant Sharma: టీమిండియాను వేధిస్తున్న గాయాల బెడద... రెండో టెస్టుకు ఇషాంత్ డౌటే!
- నెట్ ప్రాక్టీసులో గాయపడిన ఇషాంత్
- మడమనొప్పితో బాధపడిన వైనం
- ఇషాంత్ కు వైద్యపరీక్షలు
- రేపటి నుంచి భారత్-న్యూజిలాండ్ రెండో టెస్టు
కివీస్ పర్యటనలో టీమిండియా ఆటగాళ్లు గాయాల బారిన పడుతుండడం మేనేజ్ మెంట్ ను కలవరపెడుతోంది. ఓవైపు యువ ఓపెనర్ పృథ్వీ షా గాయంతో బాధపడుతుండడంతో అతడి పరిస్థితిపై అనిశ్చితి నెలకొంది. తాజాగా, సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మకు కూడా గాయమైనట్టు తెలుస్తోంది. నెట్ ప్రాక్టీసు అనంతరం ఇషాంత్ మడమనొప్పితో బాధపడడంతో అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇషాంత్ రెండో టెస్టులో ఆడేదీ లేనిదీ మెడికల్ రిపోర్టుపైనే ఆధారపడి ఉంది. ఇషాంత్ తుదిజట్టులో లేకపోతే టీమిండియాకు నిజంగానే ఎంతో నష్టం జరుగుతుంది.
తొలి టెస్టులో బుమ్రా, షమీ విఫలమైన చోట ఇషాంతే రాణించాడు. ఇప్పుడు రెండో టెస్టు కోసం మరింత పేస్, బౌన్స్ ఉండే పిచ్ ను కివీస్ సిద్ధం చేసింది. ఇలాంటి పిచ్ పై ఇషాంత్ ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తాడు. ఈ నేపథ్యంలో ఇషాంత్ లేకపోవడం పెద్ద లోటే. రెండో టెస్టు రేపటి నుంచి జరగనున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఉమేశ్ యాదవ్ ను సన్నద్ధం చేస్తున్నారు. ఇషాంత్ గాయంతో తప్పుకుంటే ఉమేశ్ ను తుదిజట్టులోకి తీసుకుంటారు.