Sensex: కరోనా భయాలతో కుప్పకూలిన మార్కెట్లు.. 1448 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- వరుసగా ఆరో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 431 పాయింట్లు పతనమైన నిఫ్టీ
- 8 శాతం పైగా నష్టపోయిన టెక్ మహీంద్రా
కరోనా వైరస్ దెబ్బకు దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. ప్రాణాంతక వైరస్ అత్యంత వేగంగా ప్రబలుతోందనే భయాలు మార్కెట్లను కుదిపేశాయి. దాదాపు 50 దేశాలకు వైరస్ పాకడం ఇన్వెస్టర్లలో భయాందోళనలను పెంచింది. దీంతో, మదుపుదారులు అమ్మకాలకు మొగ్గు చూపారు.
ఈ నేపథ్యంలో, మార్కెట్లు వరుసగా ఆరో రోజు కూడా పతనమయ్యాయి. అన్ని సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,448 పాయింట్లు నష్టపోయి 38,297కి పడిపోయింది. నిఫ్టీ 431 పాయింట్లు కోల్పోయి 11,201కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం ఐటీసీ (0.05%) మాత్రమే లాభపడింది. టాప్ లూజర్లలో టెక్ మహీంద్రా (-8.14%), టాటా స్టీల్ (-7.57%), మహీంద్రా అండ్ మహీంద్రా (-7.50%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-6.25%), బజాజ్ ఫైనాన్స్ (-6.24%) ఉన్నాయి.