Indian Idol: ఈ సీజన్ 'ఇండియన్ ఐడల్' విజేత బూట్ పాలిష్ చేసే కుర్రాడు!
- నస్రత్ ఫతే అలీ ఖాన్ ప్రేరణతో సాధన
- న్యాయమూర్తులను మెప్పించిన సన్నీ
- రూ. 25 లక్షలతో పాటు కారును గెలుచుకున్న యువకుడు
అతని పేరు సన్నీ. ఎక్కడా హిందూస్తానీ సంగీతం నేర్చుకోలేదు. ప్రఖ్యాత సంగీతకారుడు నస్రత్ ఫతే అలీ ఖాన్ ను తన ఏకలవ్య గురువుగా భావించి, అతని పాటలు వింటూ సాధన చేశాడు. ఆయనకు భక్తుడిగా మారి, జీవితంలో ఏదైనా సాధించాలన్న తపనను పెంచుకున్నాడు. 12 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయి, జీవనోపాధి కోసం బూట్ పాలిష్ చేస్తూ, వచ్చే అరకొరా డబ్బుతో తల్లి, చెల్లిని పోషించాడు.
సోనీ టీవీలో 'ఇండియన్ ఐడల్' 11వ సీజన్ పోటీలు జరుగుతున్నాయని స్సేహితుల ద్వారా తెలుసుకుని, ముంబైకి వెళ్లేందుకు తల్లిని డబ్బులు అడిగి చివాట్లు తిన్నాడు. అయినా, తనలోని కోరికను అణచుకోలేక, రూ. 3 వేలు అప్పు చేసి ముంబై చేరుకున్నాడు. ఇండియన్ ఐడల్ పోటీలకు వెళ్లాడు. అతని నంబర్ 1072. ఓ పిచ్చి టీషర్టు, స్లిప్పర్లు వేసుకుని వెళ్లి, న్యాయమూర్తులుగా ఉన్న అనూ మాలిక్, నేహా కక్కర్, విశాల్ దద్లానీలను మెప్పించి పోటీల్లో స్థానం సంపాదించుకున్నాడు.
అంతటితో సన్నీ పయనం ఆగలేదు. సన్నీ పాడిన పాటలు వీక్షకులకు తెగ నచ్చేశాయి. పోటీలు జరిగేకొద్దీ ఫ్యాన్స్ పెరిగారు. అతని స్వగ్రామం మొత్తం రోజూ ఓట్లు వేశారు. ఫైనల్స్ లో ఐదుగురు మిగలగా, మిగతావారిని ఓడించిన సన్నీ విజేతగా నిలిచాడు. బహుమతిగా రూ. 25 లక్షల నగదు, ఓ కారును గెలుచుకున్నాడు.
అన్నట్టు ఈ పోటీలు సాగుతూ ఉండగానే బాలీవుడ్ దృష్టిలో పడ్డ సన్నీ, ఇప్పటికే 'గల్లీ బాయ్' చిత్రంలో పాట పాడాడు కూడా. ప్రస్తుతం సన్నీతో టీ-సీరీస్ ఓ కాంట్రాక్టును కూడా కుదుర్చుకుంది.