Pakistan: పాకిస్థాన్‌లో ఘోర దుర్ఘటన.. బస్సును ఢీకొన్న రైలు.. 20 మంది దుర్మరణం
- కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద ఘటన
- బస్సును 200 అడుగుల దూరం ఈడ్చుకెళ్లిన రైలు
- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును రైలు ఢీకొన్న ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్ సింధ్ ప్రాంతంలోని సుక్కూరు జిల్లా రోహ్రీ ప్రాంతంలో జరిగిందీ దుర్ఘటన. కరాచీ నుంచి సర్గోదా వెళ్తున్న బస్సు కాపలా లేని కంధ్రా రైల్వే క్రాసింగ్‌ను దాటే ప్రయత్నం చేసింది.
అదే సమయంలో రావల్పిండి నుంచి కరాచీ వెళ్తున్న 45 అప్ పాకిస్థాన్ ఎక్స్‌ప్రెస్ రైలు.. బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సుక్కూర్ కమిషనర్ షఫీక్ అహ్మద్ తెలిపారు. ప్రమాదంలో బస్సు పూర్తిగా నుజ్జు అయినట్టు చెప్పారు. బస్సును రైలు దాదాపు 200 అడుగుల వరకు ఈడ్చుకెళ్లినట్టు వివరించారు. తీవ్రంగా గాయపడిన 60 మందిని ఆసుపత్రులకు తరలించినట్టు తెలిపారు.