Donald Trump: డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై ప్రత్యేక వీడియోను విడుదల చేసిన వైట్ హౌస్!
- ఈ వారం ప్రారంభంలో భారత పర్యటన
- రెండు రోజులు ఇండియాలో ఉన్న ట్రంప్
- పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు
ఈ వారం ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సతీ సమేతంగా ఇండియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ట్రంప్ పర్యటనకు సంబంధించిన వీడియోను వైట్ హౌస్ విడుదల చేసింది. గత సోమవారం నాడు అహ్మదాబాద్ లో దిగిన ట్రంప్, తొలుత 22 కిలోమీటర్ల రోడ్ షోలో పాల్గొని, మార్గ మధ్యంలో సబర్మతీ ఆశ్రమానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆపై నూతనంగా నిర్మించిన మొతేరా స్టేడియంలో దాదాపు 1.20 లక్షల మంది ప్రజలను ఉద్దేశించి, ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ట్రంప్ ప్రసంగించారు.
అనంతరం ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించి, అక్కడి నుంచి న్యూఢిల్లీ చేరుకున్నారు. మరుసటి రోజు ఢిల్లీలో పలు కీలక చర్చల్లో పాల్గొని, ఇండియాతో ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. అపాచీ హెలికాప్టర్లను భారత్ కు అందించే కాంట్రాక్టుపై సంతకాలు చేశారు. పారిశ్రామిక వేత్తలతో సమావేశం తరువాత, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, తన గౌరవార్థం ఇచ్చిన విందుకు హాజరయ్యారు. విందు అనంతరం తిరిగి వాషింగ్టన్ కు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమం మొత్తానికి సంబంధించిన, వీడియోను వైట్ హౌస్ ట్వీట్ చేసింది.