YS Jagan: కాగితాలు పట్టుకుని రోడ్డు పక్కన నిలబడిన పేద కుటుంబాన్ని చూసి... కాన్వాయ్ ఆపించిన వైఎస్ జగన్!
- పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో ఘటన
- వెళుతున్న కాన్వాయ్ ని ఆపించి, బాధితులను పిలిపించిన జగన్
- వెంటనే న్యాయం చేయాలని కలెక్టర్ కు ఆదేశాలు
ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వేళ, రహదారులపై సెక్యూరిటీ ఎంత టైట్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. కట్టుదిట్టమైన భద్రతా వలయం మధ్య సీఎం కాన్వాయ్ వెళుతూ ఉంటుంది. అదే సమయంలో కనీసం ఒక్కసారన్నా తమ ముఖ్యమంత్రిని చూడాలని, వీలైతే, తమ కష్టాలను ఆయనకు చెప్పాలని ఆకాంక్షించి, రోడ్డుకు ఇరువైపులా నిలబడి ఆశగా చూసే ప్రజలూ ఎంతో మంది ఉంటారు. సీఎం కంట కనపడాలని ప్రయత్నిస్తుంటారు. ఇటువంటి సందర్భాల్లో, వారిని చూసి కాన్వాయ్ ఆపించే సీఎంలు చాలా అరుదు.
ఇటీవల హైదరాబాద్ లో కాన్వాయ్ లో వెళుతూ, ఓ వృద్ధుడిని గమనించిన కేసీఆర్, ఆగి, అతని సమస్యను తెలుసుకుని, పరిష్కరించిన సంగతి తెలిసిందే. సరిగ్గా అటువంటి ఘటనే ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. నిన్న జగన్ కాన్వాయ్ ఏలూరు సమీపంలో వెళుతూ ఉండగా, ఓ కుటుంబం రోడ్డు పక్కన నిలబడి, కాగితాలు పట్టుకుని ఉండటాన్ని జగన్ గమనించారు. వెంటనే కాన్వాయ్ ని ఆపించి, వారిని దగ్గరకు పిలిపించుకున్నారు.
తమకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింప చేయలేదని, తమ ఊరిలో ఉన్న చాలా కుటుంబాలకు రాలేదని, ఇటీవలి వరదల తరువాత తమకు రూ. 5 వేల సాయం కూడా అందలేదని పాత పైడిపాకకు చెందిన బొత్తా త్రిమూర్తులు ఫ్యామిలీ, తమ గోడును సీఎం వద్ద వెళ్లబోసుకుంది. ఆ వెంటనే వారికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చిన జగన్, తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముత్యాలరాజును ఆదేశించారు. ఏ సంక్షేమ పథకమైనా అర్హులందరికీ అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.