Supreme Court: జడ్జీలను వివాదంలోకి లాగకండి: సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా
- ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని పొగిడిన సుప్రీం జడ్జి అరుణ్
- తప్పుబట్టిన మాజీ న్యాయమూర్తులు, సీనియర్ లాయర్లు
- కొన్ని మంచి మాటలు కొంత మందికి నచ్చవని మిశ్రా వ్యాఖ్య
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసల్లో ముంచెత్తారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, దూర దృష్టి కలిగిన వ్యక్తి అని, అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారని కొనియాడారు. అయితే, ఒక న్యాయమూర్తి అయి ఉండి ప్రధానిని పొగిడిన మిశ్రా తీరును పలువురు మాజీ జడ్జీలు, సీనియర్ న్యాయవాదులు తప్పుబట్టారు.
ఆయన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని విమర్శించారు. అయితే దీనిపై పరోక్షంగా స్పందించిన జస్టిస్ అరుణ్ మిశ్రా జడ్జీలను వివాదాల్లోకి లాగొద్దని అన్నారు. ఢిల్లీలోని ఖరీదైన ప్రాంతం ఖాన్ మార్కెట్లోని ఓ ప్లే స్కూల్‌కు సీల్ వేసిన కేసు విచారణ సందర్భంగా అరుణ్ మిశ్రా ఈ వ్యాఖ్యలు చేశారు.
‘జడ్జీలను వివాదాల్లోకి తీసుకురాకండి. నేను మీకు (సీనియర్ న్యాయవాది ఎమ్ సింఘ్విని చూస్తూ) కొన్ని మంచి మాటలు చెప్పగలను. కానీ, అది కొంతమందికి నచ్చకపోవచ్చు’ అని అన్నారు. ప్లే స్కూల్ మేనేజ్మెంట్ తరఫున వాదించిన సింఘ్వి.. ఖాన్ మార్కెట్‌కు ఎదురుగా ఉన్న ఈ స్కూల్‌ను సీలింగ్ విధించాల్సిన ఉల్లంఘనలకు పాల్పడలేదన్నారు.
దీనిపై కల్పించుకున్న అరుణ్ మిశ్రా.. ‘చాలా మంది ప్రముఖులు ఆ చుట్టు పక్కల ఉంటారు కదా, మీరు కూడా ఖాన్ మార్కెట్లోనే నివసిస్తున్నారా?’ అని సింఘ్విని ప్రశ్నించారు. అయితే, తాను 30 ఏళ్ల కిందటే ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయానన్న సింఘ్వి.. ఖాన్ మార్కెట్ అనేది ఈ మధ్య ఏదో తప్పుడు పదం అయిపోయిందని, కానీ ఆ ప్రాంతం చాలా బాగుంటుందని చెప్పారు. అక్కడ మంచి కాఫీ షాప్స్ కూడా ఉన్నాయన్నారు.
మనది స్వతంత్ర దేశం కాబట్టి దాన్ని తాను ఖాన్ మార్కెట్ ఎలైట్ అని పిలవాలనుకుంటున్నానని చెప్పారు. పైగా, ఈ మార్కెట్‌కు ఎంతో మంది జడ్జీలు వస్తారని సరదాగా వ్యాఖ్యానించారు. వెంటనే స్పందించిన జస్టిస్ మిశ్రా.. ‘జడ్జీలను వివాదాల్లోకి తీసుకెళ్లొద్దు. కొన్ని మంచి మాటలు కొంత మందికి రుచించవు’ అన్నారు. కాగా, సదరు ప్లే స్కూల్‌పై కేసును కొట్టేసిన ధర్మాసనం.. సీలింగ్ నిర్ణయాన్నివెనక్కుతీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.