Visakhapatnam District: చంద్రబాబు సహా 20 మంది టీడీపీ నేతలపై విశాఖ పోలీసులు కేసు నమోదు
- విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకున్న వైసీపీ నేతలు
- చంద్రబాబు సహా పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలపై కేసు
- ఇద్దరు నేతలు మినహా మిగతా వారంతా వైసీపీ కార్యకర్తలే
విశాఖపట్టణం విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును అడ్డుకున్న ఘటనలో పోలీసులు మొత్తం 52 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో చంద్రబాబు సహా 20 మంది టీడీపీ నేతలు, 32 మంది వైసీపీ నేతలు ఉన్నారు. టీడీపీ నేతల్లో చంద్రబాబుతోపాటు ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వాసుపల్లి గణేశ్, గణబాబు, మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు, శ్రీభరత్ తదితరులు ఉండగా, వైసీపీ నేతల్లో కేకే రాజు, సత్తి రామకృష్ణారెడ్డి మాత్రమే ఉన్నారు. మిగిలిన వారందరూ సాధారణ కార్యకర్తలే.
ఆందోళనలో పాల్గొన్న అందరికీ 151 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎయిర్పోర్టు వద్ద జరిగిన ఆందోళనల్లో కీలకపాత్ర పోషించిన వైసీపీ నేత కేకే రాజుకు పోలీసులు సెక్షన్ 151 నోటీసు అందజేశారు. ఆత్మహత్యకు యత్నించిన ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకుడు జేటీ రామారావును విమానాశ్రయ పోలీసులు అరెస్ట్ చేశారు.