India: పంజాబ్, మధ్యప్రదేశ్ ల్లో రైలు ప్రమాదాలు.. ఐదుగురు మృతి, పలువురికి గాయాలు
- మధ్యప్రదేశ్ లో ఎదురెదురుగా ఢీకొన్న గూడ్స్ రైళ్లు
- ఇద్దరు లోకో పైలట్లు, మరొకరు మృతి
- పంజాబ్ లో కొందరు ట్రాక్ దాటుతుండగా ఢీకొట్టిన రైలు
- ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్రంగా గాయాలు
ఉత్తర భారతంలో రెండు ఘోర రైలు ప్రమాదాలు జరిగాయి. మధ్యప్రదేశ్ లో రెండు గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొనగా.. పంజాబ్ లో ట్రాక్ దాటుతున్న కొందరిని ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదాల్లో ఐదుగురు మరణించగా.. పలువురు గాయపడ్డారు. మధ్యప్రదేశ్ లో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో రెండు ట్రాక్ లపై బోగీలు పడటంతో భారీగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.
రెండు ఎన్టీపీసీకి చెందిన రైళ్లు ఢీకొని..
మధ్యప్రదేశ్ లోని సిలిగురి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఎదురెదురుగా వస్తున్న రెండు గూడ్స్ రైళ్లు బలంగా ఢీకొన్నాయి. ఈ రెండూ కూడా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కు చెందిన బొగ్గు తరలించే రైళ్లు అని, ఉత్తరప్రదేశ్ లోని రిషద్ నగర్, మధ్య ప్రదేశ్ లోని అమ్లోరీ మధ్య నడుస్తాయని అధికారులు తెలిపారు.అందులో ఒక రైలు ఖాళీగా వస్తుండగా.. మరొకటి లోడ్ తీసుకుని వెళ్తోందని అధికారులు చెప్పారు. ఖాళీగా వస్తున్న రైలుకు చెందిన ఇంజన్, పదమూడు బోగీలు పట్టాలు తప్పాయని, కొన్ని పూర్తిగా బోల్తా పడ్డాయని వెల్లడించారు. ఇద్దరు రైలు లోకో పైలట్ల (రైలు నడిపేవారు) తో పాటు మరొకరు మరణించారు.