Ayodhya Ram Mandir: అయోధ్యలో రామ మందిరం పనులు మొదలయ్యాయి.. ఉచితంగా నిర్మించేందుకు ఎల్ అండ్ టీ సంస్థ ముందుకు వచ్చిందన్న వీహెచ్ పీ

Ayodhya readies for Ram Mandir construction

  • 67 ఎకరాల స్థలాన్ని జేసీబీలు, పెద్ద యంత్రాలతో చదును చేయడం మొదలు పెట్టారు
  • 500 ఏళ్ల నాటి బానిసత్వం నుంచి విముక్తులు అవుతున్నామన్న ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర నాథ్
  • వారంలో రామ జన్మభూమి ట్రస్టు భేటీ

ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలోని రామ జన్మభూమి ప్రాంతంలో రామ మందిరం నిర్మించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. అయోధ్యలో రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అప్పగించి 67 ఎకరాల స్థలంలో పెద్ద జేసీబీలు, ఇతర యంత్రాలతో స్థలాన్ని చదును చేయడం మొదలు పెట్టారు. శనివారం సాయంత్రమే ఈ పనులు మొదలయ్యాయని రామ జన్మభూమి ప్రాంతంలో ఉన్న తాత్కాలిక రామ మందిరం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర నాథ్ దాస్ వెల్లడించారు.

500 ఏళ్ల బానిసత్వం పోతోందన్న సత్యేంద్ర నాథ్

భారత దేశంలో, ఇతర దేశాల్లో ఉన్న హిందువులు 500 ఏళ్ల నాటి బానిసత్వం నుంచి విముక్తులు అవుతున్నారని, రామ మందిరం నిర్మాణం మొదలవుతోందని ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర నాథ్ వ్యాఖ్యానించారు. రామ జన్మభూమి ప్రాంతంలో ఉన్న ఎత్తుపల్లాలను పెద్ద పెద్ద యంత్రాలతో చదును చేస్తున్నారని, పొదలు, ఇతర చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారని తెలిపారు.

ఆ పురాతన ఆలయాలను ఏం చేస్తారు?

రామ జన్మభూమి ప్రాంతంలోని 67 ఎకరాల విస్తీర్ణంలో 12 పురాతన ఆలయాలు ఉన్నాయి. అందులో రామ జన్మస్థలితోపాటు సీతా రసోయి కూడా ఉంది. అయితే ఇవి పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. 1993 నుంచీ కూడా ఈ ఆలయాల్లో పూజాపునస్కారాలేవీ జరగడం లేదు. ఆ ఆలయాలను ఏం చేస్తారన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. వాటిని తొలగించేస్తారా, లేక పునరుద్ధరిస్తారా, కొత్తగా కడతారా అన్నదానిపై రామ జన్మభూమి ట్రస్టు గానీ, వీహెచ్ పీ గానీ ఇంత వరకు ఏమీ ప్రకటించలేదు. ప్రస్తుతం ఆ స్థలాన్ని చదును చేస్తుండటంతో ఆలయాలను ఏం చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.

మందిర నిర్మాణంపై ట్రస్టు భేటీ

రామ మందిర నిర్మాణానికి సంబంధించి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు చైర్మన్ నృపేంద్ర మిశ్రా, ఇతర సభ్యులు సోమవారం.. నేషనల్ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఎల్ అండ్ టీ సంస్థ సీనియర్ ఇంజనీర్ లతో భేటీ అయి చర్చించారు.

రాముని విగ్రహాన్ని తరలించే యోచన!

రామ జన్మస్థలిలోని గర్భ గుడిలో రామలల్లా ఏర్పాటు చేసిన రాముడి విగ్రహం, ఇతర విగ్రహాలను బయటికి తరలించాలని నిర్ణయించినట్టు ఆంగ్ల మీడియా పేర్కొంది. రామ మందిరం నిర్మాణానికి వీలుగా రామ నవమి ఉత్సవాల సమయంలో గర్భగుడి నుంచి ఈశాన్య దిశలో తాత్కాలిక నిర్మాణంలోకి విగ్రహాలను తరలించనున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని అయోధ్య రాజ వంశీకులు కూడా చెప్పినట్టుగా పేర్కొంది.

రామ మందిరాన్ని ఉచితంగా నిర్మిస్తామన్న ఎల్ అండ్ టీ

అయోధ్యలో రామ మందిరాన్ని పూర్తిగా తమ ఖర్చుతో ఉచితంగా నిర్మించేందుకు ఎల్ అండ్ టీ సంస్థ ముందుకొచ్చినట్టుగా వీహెచ్ పీ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంగా వీహెచ్ పీ ఉపాధ్యక్షుడు, రామ జన్మభూమి ట్రస్టు జనరల్ సెక్రెటరీ తదితరులు ఎల్ అండ్ టీ సంస్థతో సంప్రదింపుల్లో ఉన్నారని తెలిపాయి. వచ్చే వారంలో జరగబోయే ట్రస్టు సమావేశంలో దీనికి సంబంధించి స్పష్టత రానున్నట్టు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News