Ajit Pawar: మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో భేదాభిప్రాయాలు.. కాంగ్రెస్ కు ఎన్సీపీ షాక్!
- సీఏఏ వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదన్న అజిత్ పవార్
- సీఏఏను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ కు షాక్
- ఇప్పటికే మోదీని కలిసిన ఉద్ధవ్ థాకరే
మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎన్నో రోజులు కాలేదు. అప్పుడే, మిత్ర పక్షాల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఈ కూటమి మధ్య చిచ్చు పెడుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ సీఏఏపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని... దీనివల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని వ్యాఖ్యానించారు. దీంతో, సీఏఏకు శివసేన పూర్తి అనుకూలంగా ఉందనే విషయం స్పష్టమైంది.
తాజాగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన అన్నారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీలు ఎవరి పౌరసత్వాన్ని రద్దు చేయవని... వాటికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం అనవసరమని స్పష్టం చేశారు. అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓ వైపు సీఏఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్న నేపథ్యంలో, పవార్ వ్యాఖ్యలు కాక పుట్టిస్తున్నాయి. కూటమిలోని పార్టీలు విభిన్నమైన అభిప్రాయాలతో ముందుకు సాగుతుండటంతో... ఏం జరగబోతోందో అర్థంకాక ప్రజలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు.