Amaravati: సీఎం జగన్ తన తీరు మార్చుకోవాలి...లేదంటే మరోసారి గెలవరు: కోట్ల
- పథకాలకు అర్హతలపై అసంతృప్తి
- కరెంటు బిల్లులు ఎక్కువ వస్తే డబ్బున్న వారా
- కేంద్రంలోనూ బీజేపీ తీరు సరిగా లేదు
పాలనా విధానాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన తీరు మార్చుకోవాలని, లేదంటే మరోసారి గెలవడం కష్టమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి విజయభాస్కరరెడ్డి తనయుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
సంక్షేమ పథకాల అమల్లో పారదర్శకత ఉండాలని సూచించారు. ఐదెకరాల భూమి ఉందనో, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో పథకాలను నిలిపివేస్తే నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఆదాయ వనరులు, అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై పార్లమెంటులో మద్దతు పలికిన వైసీపీ రాష్ట్రానికి వచ్చేసరికి ముస్లింలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా కోట్ల విమర్శలు గుప్పించారు. బీజేపీ విధానాలన్నీ ప్రజల్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని విమర్శించారు.