Maharashtra: ముస్లిం రిజర్వేషన్లపై వీహెచ్పీ ట్వీట్ కు శివసేన స్పందన
- విద్యాలయాల్లో ముస్లింలకు కోటా ఇవ్వనున్నట్టు ప్రకటించిన నవాబ్ మాలిక్
- తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన వీహెచ్పీ
- శివసేన నాయకత్వంలోని ప్రభుత్వం వీటికి దూరంగా ఉండాలని సూచన
విద్యాలయాల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామంటూ మహారాష్ట్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి నవాబ్ మాలిక్ (సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఎన్సీపీ నేత) రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. విశ్వ హిందూపరిషత్ ఆందోళన వ్యక్తం చేసింది.
ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లను కల్పించాలని మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయని... ఇది చాలా ఆందోళన కలిగించే అంశమని వీహెచ్పీ ట్వీట్ చేసింది. శివసేన నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలకు దూరంగా ఉండాలని వ్యాఖ్యానించింది. దేశంలోని హిందూ సమాజం ఇదే కోరుకుంటోందని చెప్పింది.
వీహెచ్పీ ట్వీట్ పై శివసేన ట్విట్టర్ ద్వారా స్పందించింది. ఈ అంశంపై ఇంతవరకు ఎలాంటి చర్చ కూడా జరగలేదని స్పష్టం చేసింది.