Venkaiah Naidu: రైతు సమస్యలపై కేంద్ర మంత్రులతో మాట్లాడిన ఉప రాష్ట్రపతి
- కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, తోమర్, పాశ్వాన్ తో చర్చ
- రైతుల బకాయిలను విడుదల చేయాలని సూచన
- రైతు సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరిన వెంకయ్యనాయుడు
రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందిపై కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, రాం విలాస్ పాశ్వాన్ తో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చర్చించారు. వ్యవసాయ, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్, ఆయా శాఖల అధికారులతో ఆయన మాట్లాడారు. రైతుల బకాయిలను విడుదల చేయాలని మంత్రులకు, అధికారులకు సూచించారు. ధాన్యం సేకరణ, రైతులకు నగదు చెల్లింపుల్లో ఆలస్యం వద్దని, సమయానికి డబ్బు ఇవ్వకుంటే రైతు నష్టపోతాడని, సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
కేంద్రం ఇచ్చిన మద్దతు ధర రైతులకు సరిగా అందడం లేదన్న విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లిన వెంకయ్యనాయుడు, ఏపీలోని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం జిల్లాల గురించి ప్రస్తావించినట్టు సమాచారం. ఈ విషయమై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా వెంకయ్యనాయుడు మాట్లాడారు. ధాన్యం తూకానికి సంబంధించి వచ్చే ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు చేసిన నాలుగు రోజుల్లోగా రైతులకు నగదు చెల్లించాలని సూచించారు. నిధుల విడుదల అంశాన్ని పరిశీలిస్తామని సీతారామన్ చెప్పినట్టు సమాచారం.