Donald Trump: నేడు 'సూపర్ ట్యూజ్ డే'... ట్రంప్ తో తలపడే ప్రత్యర్థి ఎవరో తేలిపోతుంది!
- డెమోక్రాట్ల తరఫున ముందున్న బెర్నీ శాండర్స్
- గట్టి పోటీని ఇస్తున్న జో బిడెన్
- నవంబర్ లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలు
ఈ సంవత్సరం నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో తలపడే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎవరన్నది నేడు తేలుతుంది. ప్రస్తుత అధ్యక్షునిగా రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిగా ట్రంప్ బరిలోకి దిగనుండగా, కాలిఫోర్నియా, టెక్సాస్, వర్జీనియా, ఉత్తర కరోలినాతో పాటు మొత్తం 14 ప్రధాన రాష్ట్రాలకు చెందిన డెమోక్రటిక్ పార్టీ రిప్రజెంటేటివ్స్, ఓటు వేసి, తన పార్టీ తరఫున అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. దీంతో మార్చి 3ను ‘సూపర్ ట్యూజ్ డే’గా అమెరికన్లు అభివర్ణిస్తున్నారు. కాగా, ఈ రేసులో బెర్నీ శాండర్స్ ముందంజలో ఉండగా, దాదాపు అతని పేరే ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ నుంచి బెర్నీ శాండర్స్ కు గట్టి పోటీ ఎదురు కానుందని అంచనా.