Bihar: పేపర్లు దిద్దేందుకు రాలేదట.. రెండేళ్ల క్రితం చనిపోయిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసిన అధికారులు!
- బీహార్‌లోని బెగుసరైలో ఘటన
- అధికారుల తీరుపై మండిపడుతున్న ఉపాధ్యాయులు
- నిర్లక్ష్యానికి పరాకాష్ఠ
ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ. రెండేళ్ల క్రితం మృతి చెందిన ఉపాధ్యాయుడిని ఉన్నతాధికారులు తాజాగా సస్పెండ్ చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. బీహార్‌లో జరిగిందీ ఘటన. ఇంతకీ ఏం జరిగిందంటే.. తమను క్రమబద్ధీకరించాలంటూ గత నెల 17న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పరీక్ష పేపర్లు దిద్దేందుకు వెళ్లిన రెగ్యులర్ ఉపాధ్యాయులను అడ్డుకున్నారు. వారిపై దాడి కూడా చేసినట్టు వార్తలొచ్చాయి. దాడి నేపథ్యంలో ఉపాధ్యాయులు విధులకు గైర్హాజరయ్యారు.
ఉపాధ్యాయులు గైర్హాజరు కావడాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు విధులకు హాజరుకాని ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించి గత నెల 28న ఆదేశాలు జారీ చేశారు. ఇందులో విశేషం ఏమీ లేకపోయినా.. వారు సస్పెండ్ చేసిన ఉపాధ్యాయుల్లో రెండేళ్ల క్రితం మరణించిన రంజిత్ కుమార్ యాదవ్ అనే టీచర్ పేరు కూడా ఉండడం విమర్శలకు కారణమైంది. బెగుసరైలోని కేంద్రంలో పేపర్లను దిద్దాల్సిన ఆయన విధులకు గైర్హాజరయ్యారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం మృతి చెందిన వ్యక్తి పేపర్లు దిద్దేందుకు ఎలా వస్తారంటూ అధికారుల నిర్లక్ష్యంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.