Devendra Fadnavis: మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​కు సుప్రీంకోర్టు షాక్

Devendra Fadnavis To Face Trial Over Poll Affidavit

  • ఎన్నికల అఫిడవిట్ కేసులో ట్రయల్ నిరాకరణకు నో
  • ఫడ్నవీస్‌ రివ్యూ పిటిషన్‌ను కొట్టేసిన ధర్మాసనం 
  • ఇదివరకు ఇచ్చిన ఆదేశాలనే అమలు చేయాలని నిర్ణయం

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 2014 ఎన్నికల అఫిడవిట్‌కు సంబంధించిన కేసులో ఆయన విచారణను ఎదుర్కోనున్నారు. ఈ కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించాలంటూ ఇదివరకు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ ఫడ్నవీస్‌ వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.  

 2014 ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో తనపై ఉన్న రెండు కేసుల వివరాలను పొందుపరచని ఫడ్నవీస్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నాగ్‌పూర్‌‌కు  చెందిన ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. అయితే, దేవేంద్రపై కేసు నమోదు చేసేందుకు నాగ్‌పూర్‌‌ కోర్టు నిరాకరించగా.. బాంబే హైకోర్టు దాన్ని సమర్థించింది.

దాంతో, సదరు న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న సుప్రీం.. ఫడ్నవీస్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాల్సిందిగా గతేడాది ఆక్టోబర్‌‌లో నాగ్‌పూర్ కోర్టును ఆదేశించింది. దాంతో, ప్రజాప్రతినిధుల చట్టంలోని 125ఎ సెక్షన్ ప్రకారం ఫడ్నవీస్‌కు నాగ్‌పూర్‌‌ కోర్టు నోటీసులు జారీ చేసింది.

అయితే, ప్రజా సమస్యల కోసం నిరసన తెలిపినప్పుడు రాజకీయ ప్రేరేపణతో తనపై ఆ రెండు కేసులు నమోదయ్యాయని ఫడ్నవీస్ పేర్కొన్నారు. తనపై ఉన్న కేసులను గానీ, మరే సమాచారాన్ని గానీ దాచిపెట్టలేదని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే, జరిమానాతో సరిపోయే తప్పిదానికి క్రిమినల్ కేసు నమోదు చేయడం సరికాదని ఫడ్నవీస్ తరఫు లాయర్ కోర్టుకు విన్నవించారు. కానీ, తమ తీర్పును సమీక్షించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ఫడ్నవీస్‌కు నిరాశ తప్పలేదు.

  • Loading...

More Telugu News