Narendra Modi: ఆదివారం నా సోషల్ మీడియా అకౌంట్లను వాళ్లకు ఇచ్చేస్తున్నా: మోదీ
- సోషల్ మీడియా నుంచి తప్పుకోవాలని ఉందంటూ మోదీ వ్యాఖ్యలు
- తీవ్ర చర్చనీయాంశంగా మారిన ప్రధాని వ్యాఖ్యలు
- మహిళా దినోత్సవం సందర్భంగా ఆ నిర్ణయం తీసుకున్నట్టు తాజాగా వెల్లడి
- ఒక్కరోజు పాటు మహిళలకు తన సోషల్ మీడియా అకౌంట్లు ఇచ్చేస్తానంటూ పోస్టు
ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యల వెనుక ఎంతటి అర్థం దాగివుంటుందో తెలిపేందుకు ఈ పరిణామాలే నిదర్శనం. ఆదివారం తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తప్పుకోవాలని ఉందంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారడం తెలిసిందే. ఈ నిర్ణయంపై రాహుల్ గాంధీ వాయువేగంతో స్పందించి మోదీని తూర్పారబట్టారు. అయితే ఇక్కడే మోదీ తనదైన మార్కు చూపించారు. ఈ మేరకు మరో ట్వీట్ ద్వారా అసలు విషయం చెప్పారు.
"ఆదివారం మార్చి 8న మహిళల దినోత్సవం సందర్భంగా నా సోషల్ మీడియా అకౌంట్లను స్ఫూర్తిదాయకమైన మహిళలకు ఇచ్చేస్తున్నా. తమ జీవితం, తమ ఘనతల ద్వారా మనకు స్ఫూర్తిగా నిలుస్తున్న మహిళలు ఆ రోజున నా సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టులు చేసుకోవచ్చు. వారి పోస్టులు కోట్లాది మందిలో చైతన్యాన్ని రగల్చడంలో సాయపడతాయని భావిస్తున్నాను. మీలోనూ అలాంటి స్ఫూర్తినిచ్చే మహిళ ఉంటే, అలాంటి మహిళల గురించి మీకు తెలిసివుంటే ప్రేరణాత్మక పోస్టులు చేయండి" అంటూ మోదీ పిలుపునిచ్చారు.