Andhra Pradesh: అర్ధరాత్రి పది నిమిషాల్లో పదకొండు రహస్య జీవోలు.. విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం!
- రాత్రి 11:45 గంటల నుంచి 11:55 మధ్య పదకొండు జీవోల విడుదల
- రిజర్వేషన్లను 50 శాతానికి కుదించి ఉంటారని అభిప్రాయం
- విడుదల చేసిన పంచాయతీరాజ్ శాఖ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత అర్ధరాత్రి పది నిమిషాల వ్యవధిలో పదకొండు రహస్య జీవోలను విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాత్రి 11:45 గంటల నుంచి 11:55 మధ్య పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పది జీవోలను, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఒక జీవోను విడుదల చేసింది. యాభై శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం అర్ధరాత్రి ఈ జీవోలను విడుదల చేయడం గమనార్హం.
59.85 శాతంగా ఉన్న రిజర్వేషన్లను 50 శాతానికి కుదిస్తూ ఎన్నికలకు వెళ్లేందుకు వీలుగా ఆర్డినెన్స్ లేదంటే జీవోలలో ఏదో ఒకటి తెచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రహస్యంగా ఈ జీవోలను తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. మున్ముందు న్యాయపరమైన ఇబ్బందులు ఎదురుకాకూడదన్న ఉద్దేశంతో వీటిని విడుదల చేసినట్టు చెబుతున్నారు. నేటి మంత్రి వర్గ సమావేశంలో రిజర్వేషన్లపై చర్చించి, ఆమోదించే అవకాశం ఉన్న నేపథ్యంలో రిజర్వేషన్లను 50 శాతానికి కుదించి జీవోలు తెచ్చి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.