Ashok Gajapathi Raju: అశోక్ గజపతిరాజుకి షాక్.. సింహాచలం దేవస్థానం చైర్మన్ పదవి నుంచి తొలగించిన ఏపీ ప్రభుత్వం!
- మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి కూడా తొలగింపు
- రెండు పదవుల్లోనూ ఆయన అన్న కుమార్తె నియామకం
- చెల్లదంటున్న అశోక్ అనుచరులు
టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును సింహాచలం దేవస్థానం చైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం రహస్య ఉత్తర్వులు విడుదల చేసింది. విజయనగరం సంస్థానాధీశులకు చెందిన మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్(మాన్సాస్) ట్రస్టు అధ్యక్ష పదవి నుంచి కూడా అశోక్‌ను తప్పించింది. ఈ రెండు పదవుల్లోనూ ఆయన సోదరుడు, మాజీ మంత్రి పూసపాటి ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజును నియమిస్తూ అర్ధరాత్రి రహస్య ఉత్తర్వులిచ్చింది. ఉత్తర్వులు అందిన వెంటనే బుధవారం సంచయిత ప్రమాణ స్వీకారం చేశారు.
మాన్సాస్ ట్రస్టు పరిధిలో సింహాచలం ఆలయం సహా 108 దేవాలయాలు ఉన్నాయి. వేల కోట్ల విలువైన 14,800 ఎకరాల భూములు, విద్యాసంస్థలు, భవనాలు ఈ ట్రస్ట్ పరిధిలో ఉన్నాయి. కాగా, అశోక్‌గజపతిరాజును రెండు పదవుల నుంచి తప్పించడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ట్రస్ట్ సారథ్యంలో ఉన్న విలువైన ఆస్తులను పరాధీనం చేసే కుట్రతోనే ఆయనను పదవుల నుంచి తొలగించినట్టు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఆమె నియమాకం చెల్లదని, మాన్సాస్ ట్రస్ట్ డీడ్ ప్రకారం రాజవంశంలో పెద్దవాడైన పురుష వారసుడే ట్రస్ట్ చైర్మన్‌గా ఉండాలని చెబుతున్నారు. దీనిపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని అశోక్ అనుచరులు పేర్కొన్నారు.