Hyderabad: పాత్రికేయ దిగ్గజం పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత
- విజయ్‌నగర్ కాలనీలో ఈ రోజు ఉదయం తుదిశ్వాస
- గత కొంతకాలంగా అనారోగ్యం
- ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా పొత్తూరు
ప్రముఖ పాత్రికేయుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు ఈరోజు ఉదయం హైదరాబాద్ విజయ్ నగర్ కాలనీలోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయన వయసు ఎనభై ఆరేళ్లు. 1957లో ‘ఆంధ్రజనతా’ పత్రికతో తన జర్నలిస్టు జీవితానికి శ్రీకారం చుట్టిన పొత్తూరి వెంకటేశ్వరరావు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, వార్త పత్రికల్లో వివిధ స్థాయుల్లో పనిచేశారు. రాజకీయం, సాంస్కృతిక, సాహిత్య అంశాల్లో అద్భుతమైన కథనాలు రాశారు.
గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందినా ఫలితం లేకపోయింది. పత్రికా రంగంలో ఐదు దశాబ్దాలకుపైగా సేవలందించిన వెంకటేశ్వరరావు స్వస్థలం గుంటూరు జిల్లా పొత్తూరు.
2000 సంవత్సరంలో ఆయన రాసిన ‘నాటి పత్రిక మేటి విలువలు', 2001లో రాసిన చింతన, చిరస్మరణీయాలు పుస్తకాలు పొత్తూరి రచనా సామర్థ్యానికి మచ్చుతునకలు. వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు, విధి నా సారథి, పారమార్థిక పదకోశం పుస్తకాలు ఆయన రాసినవే.
మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు గురించి రాసిన ‘ఇయర్స్ ఆఫ్ పవర్’కు సహ రచయితగా పొత్తూరి వ్యవహరించారు.