Corona Virus: ఇండియాలో కరోనా విస్తరిస్తోంది... 29 పాజిటివ్ కేసులు... రాజ్యసభలో ఆరోగ్య మంత్రి కీలక ప్రకటన!
- పరిస్థితిని ప్రధాని సమీక్షిస్తున్నారు
- తెలంగాణతో పాటు ఢిల్లీ, రాజస్థాన్, కేరళ రాష్ట్రాల్లో కేసులు
- అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేశామన్న హర్షవర్ధన్
ఇండియాలో కరోనా (కోవిడ్-19) వైరస్ రోజురోజుకూ విస్తరిస్తోందని, పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకూ ఇండియాలో 29 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, దాదాపు 3 వేల మందికి పైగా అనుమానితులు వివిధ ఆసుపత్రుల్లో ఉన్నారని ఆయన తెలిపారు. ఢిల్లీతో పాటు ఆగ్రా, రాజస్థాన్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయని తెలిపారు.
దుబాయ్ నుంచి వచ్చిన తెలంగాణ వ్యక్తికి కరోనా సోకిందని, అతనికి నిపుణులైన వైద్యులు చికిత్సను అందిస్తున్నారని హర్షవర్ధన్ వెల్లడించారు. కేరళలో ముగ్గురు చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు. వైరస్ ను అడ్డుకునేందుకు అన్ని చర్యలూ చేపట్టామని, అన్ని రాష్ట్రాలనూ వైరస్ పై అప్రమత్తం చేశామని తెలిపారు.
ఇటలీ, చైనా, జపాన్ తదితర కరోనా వ్యాధి వ్యాపించిన దేశాలకు భారతీయులు ఎవరూ పర్యటనలకు వెళ్లవద్దన్న హెచ్చరికలను జారీ చేసినట్టు తెలిపారు. ఇండియాలో పరిస్థితిపై మంత్రుల కమిటీ ఇప్పటివరకూ 4 సార్లు భేటీ అయిందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.