Sachin Bansal: ఫ్లిప్ కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ పై భార్య వేధింపుల కేసు!
- భర్తపై కేసు పెట్టిన ప్రియా బన్సాల్
- తన సోదరిని కూడా లైంగికంగా వేధించారని ఫిర్యాదు
- అత్తమామలు, మరిది సహా నలుగురిపై కేసు
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్, తన భార్యను శారీరకంగా, మానసికంగా వేధించాడన్న ఆరోపణలతో వరకట్న వేధింపుల కేసు నమోదైంది. సచిన్ భార్య ప్రియా బన్సాల్ బెంగళూరు కోరమంగళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు రిజిస్టర్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. సచిన్ తో పాటు అత్తమామలు, అతని సోదరుడు తనను నిత్యమూ వేధిస్తున్నారని ప్రియ ఫిర్యాదు చేశారు. మామ సత్య ప్రకాశ్, అత్త కిరణ్ బన్సాల్, బావమరిది నితిన్ బన్సాల్ లపైనా ఆమె ఫిర్యాదు చేశారు.
2008లో తమ వివాహం జరిగిందని, డెంటల్ డాక్టర్ ను అయిన తనను సచిన్ కు ఇచ్చి పెళ్లి జరిపించారని, ఆ సమయంలో రూ. 11 లక్షల కట్నం ఇవ్వడంతో పాటు రూ. 50 లక్షలను ఖర్చు చేసి వివాహాన్ని ఘనంగా జరిపించారని ఫిర్యాదులో తెలిపారు. కొంతకాలంగా తన ఆస్తులను రాసివ్వాలని సచిన్ ఒత్తిడి చేయడం ప్రారంభించారని, తనపై శారీరకంగా దాడి చేశాడని, డబ్బులు లాక్కున్నారని ఆమె ఆరోపించారు.
తాను ఇంట్లో లేని సమయంలో తన సోదరిపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఐపీసీలోని సెక్షన్ 498 ఏ, 34లతో పాటు వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 3, 4కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని వెల్లడించారు. కాగా, గత నెల 29న సచిన్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తనపై వచ్చిన వేధింపులపై మాత్రం ఆయన ఇంకా స్పందించలేదు.