Mumbai: 26/11 నాటి ముంబయి సాహస వీరులకు పదోన్నతి
- 2008లో మొత్తం 10 మంది ముష్కరులు 12 చోట్ల దాడులు
- వీరిలో ప్రాణాలతో చిక్కింది అజ్మల్ కసబ్ ఒక్కడే
- కసబ్ ను పట్టుకున్న 14 మందికి ప్రమోషన్ ఇచ్చిన ఉద్ధవ్ ప్రభుత్వం
ముంబయి మారణ హోమం... 2008 నవంబరు 26వ తేదీన జరిగిన ఈ ఉగ్ర ఘటన ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పది మంది సముద్రం గుండా నగరంలోకి ప్రవేశించి దక్షిణ ముంబయిలోని తాజ్ హోటల్, ఛత్రపతి శివాజీ టెర్మినల్, ఒబెరాయ్ ట్రైడెంట్, నారిమన్ హౌస్, చబాద్ హౌస్, లియోపోల్డ్ కేఫ్, కామా ఆసుపత్రి, మెట్రో సినిమాతోపాటు మొత్తం 12 చోట్ల ఏకకాలంలో దాడులుచేసి 166 మందిని పొట్టన పెట్టుకున్నారు.
వందలాది మంది క్షతగాత్రులయ్యారు. ఈ పది మందిలో ప్రాణాలతో చిక్కిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ ఒక్కడే. ఆసుపత్రిపై దాడిచేసిన అనంతరం కసబ్ తోపాటు మరో ఉగ్రవాది కారులో పరారవుతుండగా అందిన సమాచారం మేరకు పోలీసులు కాపుకాశారు. కారు సమీపంలోకి వచ్చి వెనుదిరిగే ప్రయత్నం చేయగా పోలీసులు కాల్పులు జరిపారు.
ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు చనిపోగా, కసబ్ బతికే ఉన్నాడు. కాల్పుల అనంతరం కారును చుట్టుముట్టిన పోలీసులు తలుపుతీయగానే కసబ్ కాల్పులు జరపడంతో తుకారాం ఓంబ్లే ప్రాణాలు కోల్పోయాడు. మరో 13 మంది కసబ్ ను పట్టుకున్నారు. ఈ 14 మందికి అప్పట్లోనే ప్రభుత్వం అవార్డులు అందజేసింది. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం మృతి చెందిన ఓంబ్లేతోపాటు మొత్తం 14 మందికి పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
'అప్పటి వారి సాహసానికి గుర్తుగా ఈ పదోన్నతి కల్పించినట్టు మహారాష్ట్ర హెూంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ తెలిపారు. అప్పట్లో పోలీసులు సజీవంగా పట్టుకున్న కసబ్ ను కోర్టు తీర్పు అనంతరం 2012 నవంబరు 21న ఉరితీశారు.