Tammareddy Bhardwaj: సీఎం జగన్ పై తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు
- తాను ముప్పై ఏళ్లు సీఎంగా ఉండాలని జగన్ కోరుకున్నారు
- నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
- ఎవడితోనూ శాపం పెట్టించుకోకుండా ఉండగలిగితేనే అది సాధ్యం
- వాళ్ల నాన్నలా ఇతనూ మంచిపేరు తెచ్చుకుంటాడని కోరుకుంటున్నా
ఏపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ప్రముఖ సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రాజధానిగా అమరావతే ఉండాలని ఒకరు, ‘మూడు రాజధానులు’ అని ఇంకొకరు అంటున్నారని విమర్శించారు. రాజధానులు ఎన్ని ఏర్పాటు చేసుకున్నా అభ్యంతరం లేదని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు.
కానీ, రైతుల దగ్గర భూములు తీసుకున్న గత ప్రభుత్వం వారికి కొన్ని హామీలు ఇచ్చిందని, వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందని అన్నారు. అమరావతిలో ఇప్పటికే బిల్డింగ్స్ నిర్మించి ఉన్నాయని, వాటిని వినియోగించకుండా, విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలంటే మళ్లీ పది నుంచి ఇరవై వేల కోట్లు ఖర్చవుతాయని, అంత ఖర్చు చేయడమంటే ప్రజాధనం వృథా చేసినట్టేగా? అని అన్నారు.
ఈ సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యల గురించి ఆయన ప్రస్తావించారు. ముప్పై ఏళ్లు తాను ముఖ్యమంత్రిగా ఉండాలని అనుకుంటున్నానని జగన్ అన్నారని, ‘నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే, ఎవడితోనూ శాపం పెట్టించుకోకుండా ఉండగలిగితేనే. ఆ శాపం లేకుండా.. మంచి చేస్తాడని, వాళ్ల నాన్నలా ఇతను (జగన్) కూడా మంచిపేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడని కోరుకుంటున్నా’ అని అన్నారు.