Nirav Modi: నీరవ్ మోదీకి మరోసారి నిరాశ.... బెయిల్ కు నో చెప్పిన న్యాయస్థానం
- ఐదోసారి మోదీ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
- గృహ నిర్బంధంలోనే ఉంటానని మోదీ చెప్పినా సమ్మతించని కోర్టు
- 4 మిలియన్ పౌండ్లకు ష్యూరిటీ సమర్పిస్తానన్న మోదీ
- దేశం విడిచి వెళ్లిపోతాడన్న అనుమానంతో బెయిల్ కు కోర్టు ససేమిరా
పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల మేర మోసగించి లండన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది. మోదీ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను లండన్ న్యాయస్థానం తిరస్కరించింది. ఈ నెల 24 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్టు పేర్కొంది. ఆయన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురవడం ఇది ఐదోసారి.
తప్పనిసరిగా గృహ నిర్బంధంలోనే ఉంటానని, 24 గంటల పోలీసు పర్యవేక్షణకు సమ్మతమేనని మోదీ ప్రతిపాదనలు చేసినా కోర్టు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించలేదు. అంతేకాదు 4 మిలియన్ పౌండ్లకు బెయిల్ ష్యూరిటీ సమర్పిస్తానని పేర్కొన్నా న్యాయమూర్తి ఒప్పుకోలేదు. బెయిల్ ఇస్తే దేశం విడిచి పోతాడన్న అనుమానంతోనే లండన్ న్యాయస్థానం బెయిల్ నిరాకరించినట్టు అర్థమవుతోంది.