Mopidevi Venkataramana: బీసీల అభ్యున్నతికి చంద్రబాబు అడ్డుపడుతున్నారు: ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ
- ‘స్థానిక’ఎన్నికల్లో రిజర్వేషన్ల శాతం తగ్గించాలని కోరింది బాబే
- బిర్రు ప్రతాప్ రెడ్డితో కోర్టులో పిటిషన్ దాఖలు చేయించింది ఎవరు?
- బీసీలను ఓటుబ్యాంకుగానే చంద్రబాబు చూశారు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఎలక్షన్స్ నిర్వహించాలని ఏపీ హైకోర్టు ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విషయమై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై మంత్రి మోపిదేవి వెంకటరమణ విమర్శలు గుప్పించారు. ఈ ప్రక్రియకు ప్రధాన కారకుడు బాబేనని, బీసీల అభ్యున్నతికి అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల శాతం తగ్గించాలని కోరుతూ ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బిర్రు ప్రతాప్ రెడ్డి తో కోర్టులో పిటిషన్ దాఖలు చేయించింది చంద్రబాబేనని, ఆయన టీడీపీ వ్యక్తి కాదా? అని ప్రశ్నించారు.
బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్నానంటూ బాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీలను ఓటు బ్యాంకుగానే చంద్రబాబు చూశారని విమర్శించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ పాటుపడుతున్నారని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వంలో ఐదుగురు ఉపముఖ్యమంత్రుల్లో నలుగురు ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినవారు ఉన్నారని, శాశ్వత బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించిన ఘనత జగన్ దేనని అన్నారు.