Gagandeep Kung: కరోనాపై దిగులొద్దు.. ఒక్క పారాసెటమాల్ చాలు: శాస్త్రవేత్త గగన్‌దీప్ కంగ్
- ప్రతి ఐదుగురిలో నలుగురు వారంతట వారే కోలుకుంటున్నారు
- దగ్గు, జ్వరం తగ్గడానికి పారాసెటమాల్ చాలు
- డయాబెటిస్, గుండెజబ్బులతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి
కరోనా వైరస్ గురించి భయపడాల్సిన పనిలేదని, ఒక్క పారాసెటమాల్ ట్యాబ్లెట్‌తో దానికి దూరంగా ఉండొచ్చని ప్రముఖ శాస్త్రవేత్త గగన్‌దీప్ కంగ్ తెలిపారు. దగ్గు, జ్వరం తగ్గడానికి పారాసెటమాల్ వంటి ట్యాబ్లెట్లను వాడితే సరిపోతుందన్నారు. కరోనా నిర్ధారిత కేసుల్లో ప్రతి ఐదుగురిలో నలుగురు తమంత తామే కోలుకుంటున్నారని, ఒక్కరు మాత్రమే వైద్యుడిని సంప్రదించాల్సి వస్తోందని తెలిపారు. ప్రతి రోజూ మనం ఎన్నో వైరస్ల ప్రభావానికి గురవుతుంటామన్నారు.
చేతులను శుభ్రంగా కడుక్కోవడం, క్రిముల్ని హరించే ద్రవాలతో నేలను శుభ్రం చేసుకుంటే సరిపోతుందని కంగ్ తెలిపారు. అలాగే, చేతులను తరచూ ముఖంపై పెట్టకపోవడమే మేలని అన్నారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు మాత్రం వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించాలని సూచించారు. కరోనా వైరస్ ‘సార్స్’ అంతటి ప్రమాదకారి కాదని అయితే, ‘ఫ్లూ’తో పోలిస్తే మాత్రం తీవ్రత కొంత ఎక్కువని వివరించారు. బీపీ, డయాబెటిస్, గుండెజబ్బులతో బాధపడే వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.