Upasana: కరోనా మాస్కులు ఎలా తయారుచేసుకోవాలో చూపించిన ఉపాసన
- టిష్యూతో మాస్కులు చేసి చూపించిన ఉపాసన
- ఓ వీడియోలో చూశానని వెల్లడి
- మాస్కుల వినియోగంపై ప్రజలకు సూచనలు అందించిన ఉపాసన
కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు నగరాల్లో ప్రజలు మాస్కులు ధరించి తిరుగుతున్నారు. అయితే కొన్నిచోట్ల మాస్కుల లభ్యత లేకపోగా, మరికొన్ని ప్రాంతాల్లో మాస్కుల ధరలు బాగా పెరిగినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఉపాసన కొణిదెల స్పందించారు. మెడికల్ షాపుల్లో మాస్కులు అందుబాటులో ఉండడం లేదని తెలుస్తోందని, టిష్యూతోనూ మాస్కులు తయారు చేసుకోవచ్చని ఓ వీడియోలో తాను చూశానని వివరించారు.
అంతేకాదు, టిష్యూ పేపర్ తో మాస్కు ఎలా రూపొందించాలో ఎంతో సులువుగా చేసి చూపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కరోనాపై భయం వీడి బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అవసరం ఉంటేనే మాస్కు ధరించాలని, మీకు కరోనా ఉన్నట్టు అనుమానం వచ్చినప్పుడు, ఇతరులకు కరోనా సోకినట్టు అనిపించినప్పుడు మాత్రమే మాస్కులు ధరించాలని సూచించారు. మాస్కును తొలగించిన తర్వాత దాన్ని విధిగా చెత్తబుట్టలోనే వేయాలని స్పష్టం చేశారు.