Lok Sabha: ఎంపీలు, సందర్శకులకు కరోనాపై మార్గదర్శకాలు జారీ చేసిన లోక్ సభ
- రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా వ్యాప్తి
- ప్రకటన జారీ చేసిన లోక్ సభ
- చేతులు, ముక్కుకు సంబంధించి అన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టీకరణ
- పార్లమెంటు ఆవరణలో భారీగా జనం గుమిగూడడంపై ఆంక్షలు
దేశంలో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. తమకు కరోనా సోకిందేమోనన్న అనుమానంతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఎంపీలకు, పార్లమెంటు సందర్శకులకు లోక్ సభ కరోనా వైరస్ మార్గదర్శకాలు జారీ చేసింది.
చేతులకు, ముక్కుకు సంబంధించి తగిన రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కరచాలనం చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తుంపరలు మీద పడకుండా చూసుకోవాలని పేర్కొంది. పార్లమెంటు ఆవరణలో భారీగా జనం గుమికూడడాన్ని నిరోధించాలని తెలిపింది. అధికారిక, కార్యనిర్వాహక బాధ్యతల నిమిత్తం వచ్చేవారు కాకుండా, ఇతరులపై కఠిన నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని లోక్ సభ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ విషయంలో ఎంపీలు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.