Jagan: ఉగాది రోజున 26.6 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ: సీఎం జగన్
- ఏపీ గృహ నిర్మాణ శాఖ అధికారులతో జగన్ సమీక్ష
- 2024 నాటికి 30 లక్షల ఇళ్లు నిర్మించేలా కార్యాచరణ
- ఇళ్లన్నీ ఒకే నమూనాలో ఉండేలా చూడాలని ఆదేశాలు
ఏపీ గృహ నిర్మాణ శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. తాడేపల్లిలో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రి శ్రీరంగనాథరాజు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పేదల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన కార్యాచరణపై, ప్రస్తుతం ఇస్తున్న ఇళ్ల పట్టాలు, పట్టణ, నగరాభివృద్ధి సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, ఆయా పథకాల ద్వారా ఇప్పటివరకూ మంజూరైన ఇళ్ల వివరాలు, ఇంకా ఎన్ని ఇళ్లు రాష్ట్రానికి మంజూరు అయ్యేందుకు ఆస్కారం ఉందనే అంశాల గురించిన వివరాలను అధికారులను అడిగి జగన్ తెలుసుకున్నారు.
ఉగాది పండగ రోజున 26.6 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నామని, 2024 నాటికి 30 లక్షల ఇళ్లు నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించినట్టు జగన్ తెలిపారు. ఇళ్లన్నీ ఒకే నమూనాలో ఉండేలా చూడాలని ఆదేశించిన జగన్, డిజైన్ లో కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. ఇల్లు నిర్మించిన తర్వాత ఆ ఇంటిపై పావలా వడ్డీకే రూ.25 వేల వరకు రుణం వచ్చేలా బ్యాంకులతో మాట్లాడాలని, మిగిలిన వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. పేదల కోసం నిర్మిస్తున్న వైఎస్ ఆర్ జగనన్న కాలనీల్లో చెట్లు నాటాలని, డ్రైనేజ్ ఏర్పాటు, విద్యుత్, తాగునీరు కల్పించేందుకు సరైన ప్రణాళికలు అమలు చేయాలని జగన్ ఆదేశించారు.