Gautam Sawang: కరోనాపై వదంతులు సృష్టిస్తే కేసులు నమోదు చేస్తాం: గౌతమ్ సవాంగ్ హెచ్చరిక
- ఏపీలో కరోనా కేసులంటూ ప్రచారం
- అంతా వట్టిదేనన్న డీజీపీ
- సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం
- వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
కరోనా వైరస్ వ్యాప్తి కంటే వాటిపై వదంతులే మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. హైదరాబాద్ లో తొలి కరోనా కేసు వెలుగు చూసింది మొదలు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ, ఏపీల్లో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు బయటపడుతున్నాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
దీనిపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తీవ్రంగా స్పందించారు. ఏపీలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని, కానీ సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లేని పోని అపోహలు కలిగించే విధంగా వదంతులు సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామని అన్నారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసే విధంగా పోస్టులు పెడుతున్న వారిపై కేసులు నమోదు చేయాలని డీజీపీ జిల్లాల పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో కరోనా వైరస్ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించారు.