Botsa Satyanarayana: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం టికెట్లు ఇచ్చి మాట నిలబెట్టుకుంటాం: ఏపీ మంత్రి బొత్స
- రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయం
- ఈ నెల 30 లోపు ఎన్నికలు జరపాలన్నది మా ఉద్దేశం
- రెండున్నర నెలల కిందటే ఈ ఎన్నికలు నిర్వహించాలనుకున్నాం
ఏపీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం టికెట్లు ఇచ్చి మాట నిలబెట్టుకుంటామని, ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుపు తథ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు.
అనంతపురంలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 30వ తేదీ లోపు ఎన్నికలు జరపాలన్నది ప్రభుత్వం ఉద్దేశమని అన్నారు. అసలు, రెండున్నర నెలల కిందటే ఈ ఎన్నికలు నిర్వహించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని, జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 59 శాతం రిజర్వేషన్ ఉండాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకుని జీవోలు కూడా జారీ చేసిందని గుర్తుచేశారు. అలా జరగకూడదని భావించిన టీడీపీ దుర్బుద్ధితో రిజర్వేషన్లు తగ్గించాలని కోరుతూ తమ నాయకులతో చంద్రబాబు కోర్టులో పిటిషన్ వేయించడం ద్వారా ఎన్నికలను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు.