Rahul Sipligunj: నాతో పాటు ఇంకో ముగ్గురుంటేనా... మస్త్ మజా వచ్చేది: రాహుల్ సిప్లిగంజ్
- తాను అనవసరంగా ఎవరి జోలికీ వెళ్లబోనని స్పష్టీకరణ
- ఒక్కడ్నైనా ఆత్మరక్షణ చేసుకోగలిగానని వెల్లడి
- పది మంది ఒక్కడ్ని కొట్టడమేంటోనని వ్యాఖ్యలు
బిగ్ బాస్-3 విజేత, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ అనూహ్యంగా ఓ వివాదానికి కేంద్రబిందువు అయ్యాడు. ఓ పబ్ లో జరిగిన ఘర్షణలో రాహుల్ పై దాడి జరిగింది. దీనిపై రాహుల్ ఓ వీడియోలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను అనవసరంగా ఎవరి జోలికి వెళ్లనని, తనను కెలికితే ఎవరినీ వదిలిపెట్టబోనని స్పష్టం చేశాడు. తన తప్పు ఉంటే ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని, ఈ వ్యవహారంలో తనకు న్యాయం కావాలని కోరాడు. అయితే, పబ్ లో అసలేం జరిగిందన్నది చాలామందికి తెలియదని, అందుకే సీసీ టీవీ ఫుటేజ్ ను బహిర్గతం చేస్తున్నానని చెప్పాడు.
గొడవ జరిగిన సమయంలో తనతో పాటు ఐదుగురే ఉన్నారని, ప్రత్యర్థులు ఎనిమిది మంది వరకు ఉన్నారని తెలిపాడు. అయినప్పటికీ తాను ఎంతో సమర్థంగా ఆత్మరక్షణ చేసుకోగలిగానని, అందుకే పెద్ద ప్రమాదం తప్పిందని భావిస్తున్నానని తెలిపాడు. తమతో పాటు మరో ముగ్గురు ఉండుంటే అక్కడ మస్త్ మజా వచ్చేదని రాహుల్ సిప్లిగంజ్ వ్యాఖ్యానించాడు. "వాళ్లన్న ఎమ్మెల్యే అయితే ఆ దర్పం ఎక్కడ చూపించుకోవాలో అక్కడే చూపించుకోవాలి. అయినా వాళ్లకి సిగ్గు శరం లేదా... పది మంది కలిసి ఒక్కడి మీద దాడి చేశారు. చూద్దాం ఇది ఎంతవరకు వెళుతుందో!" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.