Janasena: మండపేట అత్యాచార బాధిత యువతి బాధ తెలిశాక హృదయం ద్రవించింది: జనసేన నేత నాదెండ్ల
- తూర్పుగోదావరి జిల్లా మండపేటలో డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం
- పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
- కేసులు నమోదు చేసేందుకు అధికార యంత్రాంగం తాత్సారం
- ఈ విషయం పార్టీ దృష్టికి వచ్చింది
మండపేట అత్యాచార బాధితురాలికి అండగా ఉంటామని జనసేన పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ప్రకటన విడుదల చేశారు. 'తూర్పుగోదావరి జిల్లా మండపేటలో డిగ్రీ విద్యార్థినిపై చోటు చేసుకున్న సామూహిక అత్యాచార ఘటన బాధకరమైంది. ఆ ఎస్సీ యువతి బాధ తెలుసుకుంటే హృదయం ద్రవించింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యాచారం కేసు నమోదు చేసేందుకు అధికార యంత్రాంగం తాత్సారం చేసిన విషయం పార్టీ దృష్టికి వచ్చింది' అని ఆయన ప్రకటన విడుదల చేశారు.
కాగా, మండపేటకు చెందిన ఓ యువతి ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. ఈ నెల 3న సాయంత్రం కాలేజీ నుంచి తన స్నేహితుడితో బైక్‌పై ఇంటికి బయలుదేరింది. మండపేట బైపాస్ రోడ్డులో ఇద్దరు వ్యక్తులు తాము పోలీసులమని చెప్పి ఆమె స్నేహితుడిని పక్కకు తీసుకెళ్లారు. ఆ తర్వాత యువతి వద్దకు నలుగురు వచ్చారు. ఆమెను పంట పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ కేసులో మొన్న నలుగురు నిందితులని పోలీసులు అరెస్టు చేశారు.