Mansas Trust: 'మాన్సాస్' ట్రస్ట్ ఏర్పడిన నాటి నుంచి అందులో మా కుటుంబం ఉంది: అశోక్ గజపతిరాజు
- ఏపీలో మాన్సాస్ ట్రస్ట్ రగడ
- న్యాయపోరాటం చేస్తామన్న అశోక్ గజపతిరాజు
- ఇందులో వైసీపీ జోక్యం ఉన్నట్టుగా అనిపిస్తోందన్న అదితి
ఏపీలో గజపతిరాజు వంశీయుల మధ్య మాన్సాస్ ట్రస్టు చిచ్చు రాజేసింది. ట్రస్టు చైర్మన్ బాధ్యతల నుంచి అశోక్ గజపతిరాజును తప్పించిన ప్రభుత్వం ఆయన అన్న ఆనందగజపతిరాజు కుమార్తె సంచయితకు బాధ్యతలు అప్పగించడం తీవ్ర వివాదానికి దారితీసింది. దీనిపై అశోక్ గజపతిరాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మాన్సాస్ ట్రస్ట్ ఏర్పడిన నాటి నుంచే తమ కుటుంబం అందులో భాగస్వామిగా ఉందన్నారు. 70 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగడం దారుణమని అన్నారు. మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు లేవని స్పష్టం చేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్న ఎడ్యుకేషన్ విభాగం విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు గానీ, చైర్మన్ మార్పు విషయంలో ఎలా జోక్యం చేసుకుంటారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
అటు, అశోక్ గజపతిరాజు పెద్ద కుమార్తె అదితి కూడా ఇదే తరహా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో వైసీపీ జోక్యం ఉన్నట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ట్రస్ట్ విషయంలో రాజకీయ జోక్యం ట్రస్ట్ పనితీరుపై ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తాత గారి తర్వాత పెదనాన్న, తండ్రి ట్రస్ట్ చైర్మన్ గా వ్యవహరించారని వెల్లడించారు.