KCR: ఇంటికో ఉద్యోగం ఇస్తామని నేనెప్పుడూ చెప్పలేదు: సీఎం కేసీఆర్
- కోటి మందికి ఉద్యోగాలు ఇచ్చే శక్తి తెలంగాణకు ఉందా?
- నిరుద్యోగ యువతను మభ్య పెట్టే పనులు విపక్షాలు చేయొద్దు
- యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
ఇంటికో ఉద్యోగం ఇస్తామని తాను ఎప్పుడూ చెప్పలేదని సీఎం కేసీఆర్ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా తెలంగాణ శాసనమండలిలో ఆయన ప్రసంగించారు. కోటి మందికి ఉద్యోగాలు ఇచ్చే శక్తి తెలంగాణకు ఉందా? అని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతను మభ్య పెట్టే పనులు చేయొద్దని విపక్షాలకు ఆయన హితవు పలికారు.
డిఫెన్స్, రైల్వే, బ్యాంకింగ్ రంగాల్లోకి తెలంగాణ యువత వెళ్లడం లేదని, ఏ రంగంలో అవకాశాలు ఉన్నాయో యువతకు తెలియజేస్తామని చెప్పారు. యువతకు సరైన శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ఇప్పటికే దాదాపు లక్ష ఉద్యోగాలు ఇచ్చామని, ఐటీ రంగంలో హైదరాబాద్ లో దాదాపు ఏడు లక్షల మంది పనిచేస్తున్నారని వివరించారు.