Ch Malla Reddy: నాకు వేల కోట్ల ఆస్తులూ లేవు, వాటిని కాపాడుకోవాల్సిన అవసరమూ లేదు: తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి
- ఆ మాట కరెక్టు కాదు
- ఆస్తులను కాపాడుకోవడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు
- కోట్లు కుమ్మరించి పదవులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు
తెలంగాణ రాష్ట్ర మంత్రి, విద్యా సంస్థల అధినేత మల్లారెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్తులను కాపాడుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చారా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ఆ మాట కరెక్టు కాదని, తనకు వేల కోట్ల రూపాయలు ఆస్తులూ లేవు, వాటిని కాపాడుకోవాల్సిన అవసరమూ లేదని అన్నారు. కోట్లు కుమ్మరించి పార్టీ సీట్లు, పదవులు తెచ్చుకోవాల్సిన అవసరం తనకు లేదని, టీఆర్ఎస్ లో డబ్బు ప్రభావం నడవదని అన్నారు.
తాను నిర్వహించే విద్యా సంస్థలన్నీ ట్రస్ట్ పేరిట నడుస్తాయని, ఆ ట్రస్ట్ లో ఇప్పుడు తాను లేనని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చాను కనుక ఈ విద్యా సంస్థల బాధ్యతలన్నీ తన పిల్లలకు అప్పజెప్పానని అన్నారు. తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ, ‘నాకు ఏం అవసరం? నాలుగైదు వందల ఎకరాల్లో నా ఇనిస్టిట్యూషన్స్ ఉన్నాయి’ అని, తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు నెలకు ఇచ్చే జీతాల మొత్తం రూ.20 కోట్లు అని, ‘టికెట్లు అమ్ముకునే కర్మ నాకేమి పట్టింది?’ అని ప్రశ్నించారు.