Smriti Irani: నిర్భయ దోషులపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్మృతి ఇరానీ
- నాటకాలు ఆడుతున్నారంటూ వ్యాఖ్యలు
- వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారన్న కేంద్రమంత్రి
- విధివిధానాల్లో మార్పు జరగాలని ఆకాంక్ష
నిర్భయ దోషులు ఉరి నుంచి తప్పించుకునేందుకు పిటిషన్ల పేరిట చేస్తున్న కాలయాపన కేంద్రమంత్రి సృతి ఇరానీని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఉరి అమలు నుంచి తప్పించుకోవడానికి నిర్భయ దోషులు తమ ఎత్తుగడలతో వ్యవస్థలను ఎగతాళి చేస్తున్నారని స్మృతి వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యూహాత్మక చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వ్యవస్థను ఆలంబనగా చేసుకుని నిర్భయ దోషులు నాటకాలు ఆడుతున్నారని స్పష్టంగా అర్థమవుతోందని, వీళ్లను చూస్తుంటే పట్టరాని ఆవేశం వస్తోందని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యవహారాల్లో విధివిధానాల మార్పు అత్యావశ్యకమని తాజా పరిణామాలు చాటుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.
అన్ని ఆధారాలు నిర్భయ దోషులను వేలెత్తి చూపిస్తున్నా, శిక్ష అమలు విషయంలో వ్యవస్థలన్నీ అచేతనంగా మారిపోయినట్టు కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలను వారు అపహాస్యం చేస్తున్న తీరు పునరావృతం కాకూడదని భావిస్తున్నానని తెలిపారు. బ్యూరోఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ (బీపీఆర్డీ) ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన జాతీయ మహిళా సదస్సులో స్మృతి ఈ వ్యాఖ్యలు చేశారు.