Andhra Pradesh: మరోమారు కన్నీళ్లు పెట్టుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి
- విజయనగరంలో వైసీపీ విస్తృతస్థాయి సభ
- భర్తను స్టేజిపైకి పిలవలేదని కన్నీళ్లు
- విజయసాయి ఊరడించినా ఆపని వైనం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి మరోమారు కన్నీళ్లు పెట్టుకున్నారు. నిన్న విజయనగరంలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో వేదికపైనే ఆమె వలవలా ఏడ్చేశారు. పక్కనే ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి ఊరడించినా ఆమె నిభాయించుకోలేకపోయారు. పొంగుకొస్తున్న కన్నీళ్లను అదుపు చేసుకోలేక పలుమార్లు రుమాలుతో కళ్లు తుడుచుకున్నారు. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
సమావేశం ప్రారంభంలో వేదికపై విజయసాయిరెడ్డి, బొత్స, పుష్పశ్రీవాణి, శ్రీనివాస్‌లతోపాటు పలువురు ముఖ్య నేతలను మాత్రమే వేదికపైకి పిలిచారు. దీంతో డిప్యూటీ సీఎం భర్త పరీక్షిత్ రాజు వేదిక కిందే కూర్చోవాల్సి వచ్చింది. మంత్రి కన్నీరుకు ఇదే కారణమని ఆ తర్వాత తెలిసింది. విజయసాయిరెడ్డి తరచితరచి ఆరా తీయడంతో ఆమె అసలు విషయం చెప్పారు. దీంతో అప్పటికప్పుడు పరీక్షిత్ రాజును స్టేజిపైకి పిలవడంతో పుష్పశ్రీవాణి కన్నీరు ఆపారు. మంత్రి ఇలా కన్నీరు పెట్టుకోవడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల ముఖ్యమంత్రి సభలోనూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కట్టె కాలే వరకు జగనన్నతోనే ఉంటానంటూ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు కాల్చారు.