- తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీశ్ రావు
- కేంద్రం నుంచి ఆశించిన మేర నిధులు రాలేదని వెల్లడి
- ముందు చూపుతో అనుకున్న మేర ఖర్చు చేస్తున్నామని వెల్లడి
కేంద్రం నుంచి అనుకున్న మేర నిధులు రాకున్నా, ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లోనూ తెలంగాణ రెండంకెల వృద్ధి సాధించిందని ఆర్థిక మంత్రి మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం ఆయన తెలంగాణ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.
అంచనాల మేరకు ఖర్చు చేస్తున్నాం
ఆర్థిక మాంద్యం, ప్రతికూల పరిస్థితుల్లో కూడా రూ.లక్షా 36 వేల కోట్లతో బడ్జెట్ అమలు చేశామని హరీశ్ రావు చెప్పారు. అభివృద్ధి దిశగా అన్ని రకాలుగా కృషి చేశామని, బడ్జెట్ అంచనాల మేరకు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. స్వీయ ఆదాయంలో వృద్ధి సాధించడం ద్వారా లోటును భర్తీ చేసుకున్నామన్నారు.
రెండంకెల వృద్ధి రేటు సాధిస్తున్నాం
2019–20 రాష్ట్ర జీఎస్ డీపీ 9,69,604 కోట్లు ఉంటుందని అంచనా వేశామని హరీశ్ రావు చెప్పారు. ‘‘రాష్ట్ర జీఎస్ డీపీ వృద్ధి రేటు 2018–19లో 14.3 శాతంగా ఉంటే ఆర్థిక మాంద్యం ప్రభావం వల్ల 12.6 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో దేశ వృద్ధి రేటు 11.2 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గింది. తీవ్రమైన ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం రెండంకెల వృద్ధి రేటును సాధించింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న ముందుచూపు చర్యల వల్లనే ఇది సాధ్యమైంది” అని పేర్కొన్నారు.