ICICI: ఫోన్ పే వినియోగదారులకు శుభవార్త.. యస్ బ్యాంకు స్థానంలో ఐసీఐసీఐ
- యస్ బ్యాంకుపై మారటోరియంతో నిలిచిన ఫోన్ పే సేవలు
- సేవల పునరుద్ధరణలో భాగంగా ఐసీఐసీఐతో జట్టు
- ఐసీఐసీఐకి థ్యాంక్స్ చెప్పిన సంస్థ సీఈఓ
ఫోన్ పే వినియోగదారులకు ఇది శుభవార్తే. ప్రైవేటు రంగ యస్ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించిన తర్వాత ఈ యాప్ కష్టాల్లో పడింది. ఆ బ్యాంకుతో భాగస్వామిగా ఉన్న ఫోన్ పే సేవలపైనా ఆంక్షల ప్రభావం పడింది. దీంతో గత రెండు రోజులుగా ఈ సంస్థల నుంచి సేవలు నిలిచిపోయాయి.
వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఫోన్ పే సేవల పునరుద్ధరణకు ప్రయత్నాలు ప్రారంభించింది. యస్ బ్యాంకు స్థానంలో మరో ప్రైవేటు రంగ బ్యాంకు ఐసీఐసీఐతో జట్టు కట్టాలని భావిస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ ముఖ్య కార్య నిర్వహణ అధికారి సమీర్ నిగమ్ ప్రకటించారు. అత్యవసర సమయంలో తమతో కలిసి ఆదుకున్నందుకు ఈ సందర్భంగా ఐసీఐసీఐతోపాటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కి ఆయన ధన్యవాదాలు తెలిపారు.