TTD: పలు సంచలన విషయాలు వెల్లడించిన ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీ
- చిరంజీవి లేకుంటే ఆత్మహత్య చేసుకునేవాడిని
- రాజీనామా చేస్తే ‘పోయాడు నా ...’ అనుకున్నారు
- నన్ను అన్నవాళ్లందరూ నాశనమైపోతారు
ప్రముఖ నటుడు, ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా ఉద్యోగితో రాసలీల ఫోన్ కాల్ వ్యవహారం బయటపడిన తర్వాత పృథ్వీ తన పదవికి రాజీనామా చేశారు. ఉద్దేశపూర్వకంగా జరిగిన కుట్రకు తాను బలయ్యానని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆయన.. గత రెండుమూడు రోజులుగా వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉంటున్నారు. తాజాగా, గతరాత్రి ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగు ఇండస్ట్రీలో గొప్ప వ్యక్తి చిరంజీవేనని, ఆయన లేకుంటే ఈపాటికి తాను ఆత్మహత్య చేసుకుని ఉండేవాడినని అన్నారు. ఎస్వీబీసీ వివాదం తర్వాత మానసికంగా ఇబ్బందిపడుతున్న తనను ఆదుకున్నది ఆయనేనని, మంచి వేషాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పింది ఆయనేనంటూ భావోద్వేగానికి గురయ్యారు.
సొంత పార్టీ వారే తనపై కుట్రలు చేశారని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ఆ ఫోన్ కాల్ ఫేక్ అని స్పష్టం చేశారు. తాను ఏ తప్పూ చేయలేదన్నారు. తనను ఇబ్బందిపెట్టిన వారెవరూ ఇప్పుడు బతికి లేరని, ఈ వివాదంలో ఇరికించినవారు నాశనమైపోతారని అన్నారు. ఆ వేంకటేశ్వరస్వామి వారిని తప్పకుండా దండిస్తారని అన్నారు.
తప్పు చేయకుండా పదవికి ఎందుకు రాజీనామా చేశారన్న ప్రశ్నకు పృథ్వీరాజ్ బదులిస్తూ.. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కోరిక మేరకే పదవి నుంచి తప్పుకున్నట్టు తెలిపారు. పార్టీ ప్రతిష్ఠను పెంచేందుకే రాజీనామా చేసినట్టు చెప్పుకొచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్లో తనను చెప్పుతో కొట్టి బయటకు గెంటేశారంటూ తీవ్ర వ్యాఖ్యాలు చేశారు. ఎస్వీబీసీ వివాదానికి ముందే.. ఓ టీవీ చానల్ సీఈవో ‘నీ సంగతి చూస్తా’ అని అన్నారని గుర్తు చేశారు.
తాను పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే తనను టార్గెట్ చేశారని, రాజీనామా చేశాక ‘పోయాడు నా ...’ అని అనుకున్నారని పృథ్వీ అన్నారు. తనను అందరూ విజయసాయిరెడ్డి మనిషని ప్రచారం చేసేవారని బోరున విలపించారు. తనను వైసీపీ నుంచి ఎవరూ వెలివేయలేదని అన్నారు. సీఎం జగన్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని, రాజకీయాల్లో మళ్లీ యాక్టివేట్ అవుతానని చెప్పిన పృథ్వీ.. బాధలో ఉన్నప్పుడు ఒక్కరు కూడా తనను పలకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.