Corona Virus: ఆల్కహాల్ తాగితే కరోనా రాదా..? డబ్ల్యూహెచ్ వో ఏం చెప్పిందో చూడండి
- ఆల్కహాల్, క్లోరిన్ ఒంటికి పూసుకుంటే వైరస్ రాదంటూ వదంతి
- వేడి నీళ్లతో స్నానం చేస్తే కరోనా రాదనే ప్రచారాలు
- ఇవేవీ సరికాదంటూ వివరణ ఇచ్చిన డబ్ల్యూహెచ్ వో
రోజు రోజుకు కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెందుతుండటంతో కొత్త కొత్త వదంతులు ప్రచారంలోకి వస్తున్నాయి. ఆల్కహాల్ తాగితే కరోనా వైరస్ చచ్చిపోతుందని ఒకటి, ఆల్కహాల్ నుగానీ, క్లోరిన్ ను గానీ శరీరంపై స్ప్రే చేసుకుంటే వైరస్ పోతుందని మరొకటి, వేడి నీళ్లతో స్నానం చేస్తే వైరస్ సోకదని ఇంకొకటి.. ఇలా ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ లో, సోషల్ మీడియాలో ఎన్నో వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) సోమవారం ప్రకటన జారీ చేసింది. ఆయా వదంతులు ప్రచారాలపై వివరణ ఇచ్చింది.
ఏ వదంతులు.. ఎలా మొదలయ్యాయి?
కరోనా వైరస్ నేపథ్యంలో హ్యాండ్ శానిటైజర్లతో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని డబ్ల్యూహెచ్ వో, డాక్టర్లు ప్రకటించారు. హ్యాండ్ శానిటైజర్లలో 90 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది. మిగతా పదిశాతం మరికొన్ని రసాయనాలు ఉంటాయి. అంతేకాకుండా ఆల్కహాల్, క్లోరిన్ రెండూ సూక్ష్మజీవులను నాశనం చేస్తాయన్నది ముందు నుంచీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆల్కహాల్ తాగితే కరోనా వైరస్ చచ్చిపోతుందన్న ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో ఆల్కహాల్, క్లోరిన్ ను శరీరంపై పూసుకుంటే.. వైరస్ చచ్చిపోతుందన్న వదంతి కూడా వ్యాప్తి చెందింది. ఇవి రెండూ తప్పని డబ్ల్యూహెచ్ వో వివరణ ఇచ్చింది.ఆల్కహాల్ తో వైరస్ వంటి సూక్ష్మ జీవులు చనిపోతాయన్నది వాస్తవమే. అయితే మనం ఆల్కహాల్ తాగితే అది కేవలం రక్తంలో కలిసి, ఫిల్టర్ అవుతుందని, ఏ సూక్ష్మక్రిమిపైనా ప్రభావం చూపడం ఉండదని డబ్ల్యూహెచ్ వో స్పష్టం చేసింది.
ఇక శరీరంపై ఆల్కహాల్, క్లోరిన్ పూసుకోవడం వల్ల చర్మంపై ఉండే వైరస్ చనిపోతుందని, అంతే తప్ప అప్పటికే శరీరం లోపలికి చేరిన వైరస్ పై ఎలాంటి ప్రభావం ఉండదని వివరించింది.
ఆల్కహాల్ ఉండే హ్యాండ్ రబ్ లు, హ్యాండి శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల ఫలితం ఉంటుందని తెలిపింది.
ఇక వేడి నీళ్లతో స్నానం చేస్తే వైరస్ రాదన్న ప్రచారం కూడా అవాస్తవమని చెప్పింది. అయితే వేడి నీళ్లతో గొంతు పుక్కిలించడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుందని పేర్కొంది.