T20 World Cup: ఐసీసీ టీ20 జట్టులో భారత్ నుంచి పూనమ్ యాదవ్‌కు మాత్రమే అవకాశం
- 12వ ప్లేయర్‌గా షెఫాలీ వర్మ
- ఆస్ట్రేలియా నుంచి ఐదుగురికి అవకాశం
- ఇంగ్లండ్ నుంచి నలుగురికి చోటు
మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన టీమిండియా రన్నరప్‌తో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. తుదిపోరు వరకూ భారత్ అద్భుతంగా ఆడింది. కానీ, ఈ టోర్నీలో ప్రదర్శన ఆధారంగా ఐసీసీ ఎంపిక చేసిన టీ20 ప్రపంచకప్ ఎలెవన్‌లో మాత్రం భారత్ నుంచి ఒక్క ప్లేయర్‌కే అవకాశం లభించింది. లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ మాత్రమే చోటు దక్కించుకుంది.
గ్రూప్ దశలో ఆకట్టుకున్న 16 ఏళ్ల షెఫాలీ వర్మ ఓపెనర్ కోటాలో కచ్చితంగా ఎంపికవుతుందని భావిస్తే.. ఆమె పేరును 12వ ప్లేయర్‌గా చేర్చారు. టైటిల్ విజేత ఆస్ట్రేలియా నుంచి ఏకంగా ఐదుగురు ప్లేయర్లు ఈ టీమ్‌లో చోటు దక్కించుకున్నారు. ఆసీస్ ఓపెనర్లు అలీసా హీలీ, బెత్ మూనీ, కెప్టెన్ మెగ్ లానింగ్‌తో పాటు బౌలర్లు జెస్ జొనాసెన్, మేగన్ షట్ ఎంపికయ్యారు.
మెగ్ లానింగ్ కెప్టెన్‌గా ఉన్న ఈ జట్టులో ఇంగ్లండ్ నుంచి నలుగురికి చాన్స్ దక్కింది. వ్యాఖ్యాతలు, మాజీ క్రికెటర్లు ఇయాన్ బిషప్, అంజుమ్ చోప్రా, లిసా స్తాలేకర్, విలేకరి రాఫ్ నికోల్సన్, ఐసీసీ ప్రతినిధి హోలీ కొల్విన్‌తో కూడిన సెలక్షన్ ప్యానెల్ ఈ టీమ్‌ను ఎంపిక చేసినట్టు ఐసీసీ తెలిపింది.