Gutta Jwala: పేద పిల్లల కోసం పీటీ ఉష రూ.20 లక్షలు సేకరించారు... ఎవరూ అభినందించకపోవడం బాధాకరం: గుత్తా జ్వాల
- కేరళలో అథ్లెటిక్స్ అకాడమీ స్థాపించిన పీటీ ఉష
- నిరుపేదల బాలలకు అథ్లెటిక్స్ లో శిక్షణ
- ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలన్న జ్వాల
దేశం గర్వించదగ్గ అథ్లెట్లలో పీటీ ఉష చిరస్థాయిగా నిలిచిపోతారు. ఎలాంటి సౌకర్యాలు లేని కాలంలో, ప్రతికూల పరిస్థితుల్లో అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రతిష్ఠను నిలిపేందుకు ఆమె పడిన కష్టం అసామాన్యం. అందుకే పీటీ ఉష ఇప్పటికీ అథ్లెటిక్ రంగంలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. తాజాగా పీటీ ఉషపై ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల స్పందించారు. పీటీ ఉష కేరళలో రూ.20 లక్షల మేర నిధులు సేకరించి, ఆ నిధులను నిరుపేద బాలలను అథ్లెటిక్స్ లో ప్రోత్సహించేందుకు ఉపయోగిస్తున్నారని ట్వీట్ చేశారు. అయితే, ఈ విషయంలో ఆమెను ఎవరూ అభినందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
అథ్లెటిక్స్ రంగంలో పేద బాలలను ప్రోత్సహించేందుకు తపన పడుతున్న పీటీ ఉష గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని, ఆమె కార్యక్రమాలను అందరికీ చేరవేయాలని పిలుపునిచ్చారు. అథ్లెటిక్స్ రంగం నుంచి తప్పుకున్నాక, ఔత్సాహిక అథ్లెట్లకు శిక్షణనిచ్చేందుకు పీటీ ఉష మొగ్గు చూపారు. అంతేకాదు, బాలల కోసం ప్రత్యేకంగా స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ కోసం నిధులు సేకరించేందుకు ఆమె ఎన్నో ప్రయాసలకోర్చి ఒడిదుడుకుల నడుమ స్కూల్ నడుపుతున్నారు.