- ప్రధాని అబ్దల్లా హామ్దక్ కారులో వెళ్తుండగా రోడ్డు పక్కనే పేలిన బాంబు
- ఆ దేశ రాజధాని నగరంలోనే ఘటన
- ఎవరికీ ఏం కాలేదన్న అధికారులు
- మిలటరీ పాలన నుంచి ప్రజాస్వామ్యానికి మారే దశలో సంచలన ఘటన
సూడాన్ దేశ ప్రధాన మంత్రి అబ్దల్లా హామ్దక్ పై బాంబు దాడి జరిగింది. దేశ రాజధాని కార్టోమ్ లో ఆయన కాన్వాయ్ ప్రయాణిస్తున్న మార్గంలో రోడ్డు పక్కన ఆపి ఉంచి కారులో ఎవరో బాంబు పెట్టారు. సరిగ్గా ఆయన కారు అక్కడికి వచ్చినప్పుడే బాంబును పేల్చి చంపేయాలని చూశారు. వారు అనుకున్నట్టుగానే బాంబు పేల్చినా.. కొద్దిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని అక్కడి అధికారులు ప్రకటించారు. ప్రధాన మంత్రి కారు కొంత దెబ్బతిన్నదని, బాంబు పెట్టిన కారు పూర్తిగా తుక్కుతుక్కుగా మారిందని తెలిపారు. మరో రెండు అధికారిక వాహనాలు ధ్వంసం అయ్యాయని వెల్లడించారు.
వెంటనే హై అలర్ట్
బాంబు దాడి జరిగిన సమయంలో ప్రధాన మంత్రి హామ్దక్ తన అధికారిక కార్యాలయానికి వెళుతున్నారు. అయితే దాడితో వెంటనే ఆయనను సురక్షిత ప్రదేశానికి తరలించారు. భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. ఈ దాడికి పాల్పడింది ఎవరనేదీ ఏ ఉగ్రవాద సంస్థగానీ, మరెవరుగానీ ఇంకా ప్రకటించలేదని అధికారులు తెలిపారు.
ఆఫ్రికా అభివృద్ధికి మార్గం చూపిన ఆర్థిక వేత్త
హామ్దక్ ప్రముఖ ఆర్థిక వేత్త. సూడాన్ సహా ఆఫ్రికా దేశాల అభివృద్ధికి మార్గం చూపారు. 30 ఏళ్ల పాటు ఆర్థిక వేత్తగా, పాలసీ అనలిస్టుగా కొనసాగారు. గత ఏడాది ఆగస్టులోనే సూడాన్ ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని గట్టెక్కిస్తానని, శాంతి భద్రతలు నెలకొల్పుతానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు.
మిలటరీ వర్సెస్ ప్రభుత్వం
సూడాన్ లో చాలా కాలంగా మిలటరీ ఆధిపత్యం కొనసాగుతోంది. ఆ పరిస్థితి మారాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజాస్వామ్య ఉద్యమకారులకు, మిలటరీకి మధ్య గత ఏడాది ఆగస్టులో ఒప్పందం కుదిరింది. దేశ పరిపాలన కోసం మిలటరీ, పౌర అధికారులతో ప్రత్యేక కమిటీ వేయాలని నిర్ణయించారు. ఇలాగైతే తమ చేతుల్లోంచి అధికారం వెళ్లిపోతుందన్న ఉద్దేశంతో మిలటరీ పాలకులు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హామ్దక్ పై దాడి జరగడం సంచలనంగా మారింది.