Sensex: బ్లాక్ మండే.. కుప్పకూలిన మార్కెట్లు
- ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్న కరోనా వైరస్
- 1,941 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 538 పాయింట్లు పతనమైన నిఫ్టీ
కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దాదాపు 100 దేశాలకు ఈ మహమ్మారి పాకడంతో వాణిజ్య రంగం కుదుపుకు గురైంది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా పతనమయ్యాయి. వీటన్నింటి నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను చవిచూశాయి.
ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మన మార్కెట్లు కుప్పకూలాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభం వస్తోందనే భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో, ఒకానొక సమయంలో సెన్సెక్స్ ఏకంగా 2,500 పాయింట్ల వరకు పతనమైంది. ఆ తర్వాత మార్కెట్లు కొంత మేర పుంజుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,941 పాయింట్లు పతనమై 35,634కు పడిపోయింది. నిఫ్టీ 538 పాయింట్లు కోల్పోయి 10,451కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ లో ఈరోజు ఒక్క కంపెనీ కూడా లాభపడలేదు. ఓఎన్జీసీ (16.26), రిలయన్స్ ఇండస్ట్రీస్ (12.35), ఇండస్ ఇండ్ బ్యాంక్ (10.66), టాటా స్టీల్ (8.23), టీసీఎస్ (6.88) టాప్ లూజర్లుగా ఉన్నాయి.