Perni Nani: దోచుకున్న డబ్బును దేశం దాటించేందుకు ఎస్ బ్యాంకుతో చంద్రబాబు చేతులు కలిపారు: మంత్రి పేర్ని నాని ఆరోపణలు
- బాబును ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణాకపూర్ గతంలో కలిశారు
- టీటీడీ సొమ్మును ఇక్కడ ఎందుకు డిపాజిట్ చేశారు?
- ఎస్ బ్యాంక్ వ్యవహారంపై కేంద్రం సమగ్ర విచారణ జరపాలి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ఎస్ బ్యాంక్ కుంభకోణం వ్యవహారం గురించి ప్రస్తావించారు. ప్రజల సొమ్మును దోచుకున్న ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణాకపూర్, చంద్రబాబును కలిసిన రోజులు ఉన్నాయని విమర్శించారు. తాను దోచుకున్న డబ్బును దాచుకునేందుకు, ఆ డబ్బును దేశం దాటించేందుకు ఎస్ బ్యాంకుతో చంద్రబాబు చేతులు కలిపారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు హయాంలో నిబంధనలకు విరుద్ధంగా టీటీడీ సొమ్మును ఎస్ బ్యాంక్ లో ఎందుకు డిపాజిట్ చేశారు? అని ప్రశ్నించారు. ఎస్ బ్యాంక్ ముడుపుల లావాదేవీల వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. తన మాజీ పీఎస్ అక్రమ లావాదేవీలపై చంద్రబాబు ఎందుకు నోరు విప్పలేదు? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ, వీటికి కూడా చంద్రబాబు మోకాలడ్డారని, అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు బాబు చేసిందేమీలేదని వ్యాఖ్యానించారు.