Perni Nani: గొప్ప మేధస్సు ఉన్న పవన్ కల్యాణ్.. ‘మళ్లీ ఈ గోల ఏంటి?’: మంత్రి పేర్ని నాని
- జగన్ పరిపాలన బాగుంటే పవన్ మళ్లీ సినిమాల్లో నటిస్తానన్నాడు
- ఏకంగా ఐదు సినిమాల్లో నటిస్తున్నాడు
- ఆ సంగతి చూసుకోకుండా.. ఉమ్మడి మేనిఫెస్టో గోల ఏంటి?
ప్రశ్నించడమే తమ ‘మేనిఫెస్టో’ గా చెప్పుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, ఏనాడూ మోదీ, చంద్రబాబులను ప్రశ్నించలేదని ఏపీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తనకు అధికారం లేకపోయినా ప్రజలకు మేలు చేసే ఎన్నో పనులు చేస్తున్నానని నాడు పవన్ కల్యాణ్ మాట్లాడారని, ఇప్పుడు కూడా ఆయన అధికారంలో లేరు కనుక ప్రజలకు మేలు చేసే పనులు ఎంత మేరకు చేశారని ప్రశ్నించారు. పవన్ సామాజిక బాధ్యత, ‘జనసేన’ మేనిఫెస్టోలు ఏమైపోయాయి? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో జగన్ పరిపాలన బాగుంటే తాను సినిమాలు చేసుకుంటానని పవన్ కల్యాణ్ నాడు వ్యాఖ్యలు చేశారని గుర్తుచేస్తూ.. జగన్ పాలనకు పవన్ కితాబిస్తూ ఏకంగా ఐదు సినిమాల్లో నటిస్తున్నారని సెటైర్లు విసిరారు. పవన్ సినిమాలు చేసుకోకుండా మళ్లీ ఈ గోల ఏంటి? ఈ ప్యాకేజీ ఏంటి? ఉమ్మడి మేనిఫెస్టో ఏంటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అక్కడ ప్రొడ్యూసర్లకు కాల్షీట్స్ ఇస్తే, ఇక్కడ మోదీ, అమిత్ షా, చంద్రబాబులకు పవన్ కాల్షీట్స్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలను వంచిస్తూ ఎన్నాళ్లూ ఇలా నాయకత్వం వహిస్తారు? ఇది ఎంత వరకు సమంజసం? అని ధ్వజమెత్తారు.
పెద్ద పెద్ద తాత్విక పుస్తకాలు చదివే, గొప్ప మేథస్సు ఉన్న పవన్ కల్యాణ్, ప్రజలను ఇంకా ఎన్నాళ్లూ మోసం చేస్తారు? అని ప్రశ్నించారు. నిర్మల హృదయులైన ప్రజలను మోసం చేయడం కట్టిబెట్టమని ‘పవన్ నాయుడు’ని కోరుకుంటున్నానంటూ హితవు పలికారు.